Manipulations
- ‘Dry Begging’ Is A Form Of Emotional Manipulation That Sounds All Too Familiar https://www.yahoo.com/lifestyle/articles/dry-begging-form-emotional-manipulation-110018807.html
ట్రంప్‌లున్నారు… జాగ్రత్త!
By Sunday Magazine Desk Updated : 16 Nov 2025 00:48 IST
ట్రంప్ స్వభావమే అంత! రోజుకో మాట. పూటకో అబద్ధం. హఠాత్తుగా స్నేహితుడిలా మాట్లాడతాడు, అంతలోనే శత్రువులా విషం కక్కుతాడు. కాసేపు శాంతిదూతలా ప్రవచనాలిస్తాడు. మరి కాసేపు యుద్ధభాష ఎత్తుకుంటాడు. టక్కుటమార విద్యల డొనాల్డ్ ట్రంప్ దొరతో వేగలేక పోతున్నామని… చాలా దేశాలు తలపట్టుకుని కూర్చున్నాయి. అది అధినేతల సమస్య. కానీ, మన చుట్టూ ఉన్న ట్రంప్‌ల నుంచి మాత్రం మనల్ని మనమే కాపాడుకోవాలి.
డొనాల్డ్ ట్రంప్. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. చిత్రవిచిత్ర హావభావాలతో పేపర్లో ఆయన ఫొటో కనిపించిన ప్రతిసారీ… ఆ శాల్తీని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది, ఎప్పుడో మాట్లాడినట్టే ఉంటుంది, ఏదో ఓ సందర్భంలో గట్టిగా దెబ్బలాడి ఉంటామనే అనుమానమూ కలుగుతుంది. ఆయనది మన దేశం కాకపోవచ్చు. మన ఊళ్లోనో, వీధిలోనో ఉండకపోవచ్చు. కానీ ఆ లక్షణాలు మాత్రం మన చుట్టూ చాలామందిలో కనిపిస్తాయి. ఎవరో ఒకర్ని ఉద్దేశించి ‘ఎంత స్వార్థం! అచ్చం ట్రంప్‌లా ప్రవర్తిస్తున్నాడే’, ‘ఎన్ని తెలివితేటలూ! ఫక్తు ట్రంప్‌లా మాట్లాడుతున్నాడే’… అనుకునే సందర్భాలు అనేకం. నిజమే, సమాజంలో ట్రంప్‌లకు కొదవ లేదు. వాళ్ల లీలలకు అంతే ఉండదు. కాబట్టి స్నేహితుల వేషంలో, బంధువుల రూపంలో, సహోద్యోగుల అవతారంలో తరచూ తారసపడే అనేకానేకమంది ట్రంప్‌లతో మనం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ల స్వార్థానికి బలికాకూడదు, ఆ మైండ్‌గేమ్‌కు లొంగిపోకూడదు. ప్రతిరోజూ, ప్రతిక్షణం ‘ట్రంప్‌లున్నారు జాగ్రత్త’ అని మనల్ని మనం హెచ్చరించుకుంటూ ఉండాలి.
అబద్ధాల… ‘ఆల్‌టైమ్ రికార్డ్’
‘పొద్దున్నే మంత్రిగారిని కలిశాను. నీ పనైపోతుంది’ అని బల్లగుద్దినట్టు చెబుతారు. నిజానికి, సర్పంచితోనూ మాట్లాడి ఉండరు.‘నా రెండు కార్లూ రిపేరుకొచ్చాయి. అర్జెంటుగా హైద్రాబాద్ వెళ్లాలి. నీ బండి తీసుకెళ్దామనుకుంటున్నా…’ అంటూ పొద్దున్నే కహానీ వినిపిస్తారు. వాస్తవానికి, వాళ్లకు డొక్కు స్కూటరు కూడా ఉండదు.
‘కార్డు బ్లాకైపోయింది. అకౌంట్‌లో పది లక్షలున్నా, సమయానికి వాడుకోలేని పరిస్థితి. ఓ పదివేలు గూగుల్‌పే చేస్తావూ…’ అంటూ మనల్ని బుట్టలో పడేసే ప్రయత్నం చేస్తారు. సూటిగా చెప్పాలంటే, అలాంటి వాళ్లది మొదట్నుంచీ మినిమం బ్యాలెన్స్ అకౌంటే!
కొందరంతే. అందమైన అబద్ధాల్ని అరక్షణంలో అల్లేస్తారు. ఆ గొంతుకు తడబాటే తెలియదు. ఆ స్వరంలో కించిత్ పశ్చాత్తాపమూ తొంగిచూడదు. వాస్తవానికి, అబద్ధాలాడటం అంత సులువైన పనేం కాదు. నిజం చెప్పడానికి నిజాయతీ ఒక్కటే సరిపోతుంది. అదే అబద్ధాన్ని వండివార్చడం అణుబాంబు తయారీ కంటే సంక్లిష్టమైన వ్యవహారం. పక్కాగా స్క్రీన్ ప్లే రాసుకోవాలి. ప్రత్యేకమైన పాత్రల్ని సృష్టించాలి. ఎంతోకొంత నాటకీయత జోడించాలి. చిటికెడు ఎమోషన్స్ చొప్పించాలి. అప్పుడే, అబద్ధం అతికినట్టు ఉంటుంది. కాబట్టే, నిజాలు చెబుతున్నప్పటి కంటే అబద్ధాలాడుతున్నప్పుడే మెదడుకు శ్రమ ఎక్కువని అంటారు సైకాలజిస్టులు. ట్రంప్‌లాంటి ‘ప్రొఫెషనల్స్’కు ఆ సమస్యే ఉండదు. అబద్ధాల్ని నిజాలంత నిర్భయంగా చెప్పేయగలరు. గత హయాంలో ఆయన అల్లిన అబద్ధాల చిట్టాను ‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రిక ఓ చోట భద్రంగా దాచి పెట్టింది. ఆ వివరాలతో ‘డొనాల్డ్ ట్రంప్ అండ్ హిజ్ అసాల్ట్ ఆన్ ట్రూత్’ పేరుతో ఓ పుస్తకమూ తీసుకొచ్చింది. ఆ చిట్టా ప్రకారం…
నాలుగేళ్ల పదవీకాలంలో ఆయన నోట్లోంచి జాలువారిన అసత్యాల సంఖ్య… అక్షరాలా 16,241. అందులో నెలవారీ పద్దులూ ఉన్నాయి. ఓ మాసంలో గరిష్ఠంగా 1205 అబద్ధాలు ఆడినట్టు వెల్లడైంది. అదే ఆల్‌టైమ్ రికార్డ్! రెండోసారి పదవిలోకి వచ్చాక కూడా… రెట్టించిన ఉత్సాహంతో పాత సంప్రదాయాన్నే కొనసాగిస్తున్నాడు.
ఆ వాచాలత్వానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. పచ్చి అబద్ధమని ప్రపంచానికంతా తెలిసినా, ఇండో-పాక్ అణు యుద్ధాన్ని ఒక్క ఫోన్‌కాల్‌తో ఆపేశానని రొమ్ము విరుచుకుంటూ చెబుతాడు. కాంగో రువాండా పోరుకూ చక్రం అడ్డేశానంటాడు. తన దెబ్బకు ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యం నేల మట్టానికి పడిపోయిందని ప్రగల్భాలు పలుకుతాడు. అన్ని విషయాల్లోనూ ‘అబద్ధం నా జన్మహక్కు’ అన్నట్టు వ్యవహరిస్తాడు.
నిజాలు చెప్పలేని పిరికితనం, వాస్తవాల్ని ఆమోదించలేని పలాయనవాదం, అర్థంలేని కీర్తి కాంక్ష, అంతులేని స్వార్థం… ట్రంప్ బాపతు వ్యక్తులు అబద్ధాల్ని ఆశ్రయించడానికి అనేక కారణాలు. కొన్నిసార్లు అదో మానసిక రుగ్మతా కావచ్చు. ఆ అబద్ధాల సృష్టికర్త పాలకుడైతే… ఓటుతో, తోటి పౌరుడైతే మాటతో బుద్ధి చెప్పాలి. మరీ ఆత్మీయుడైనప్పుడు, మెత్తగా మందలించాలి. మారితే మారతారు. లేదంటే, ‘నీ మీద ఒట్టు. ఇంకెప్పుడూ అబద్ధం చెప్పను’ అంటూ కొత్త అబద్ధమైనా అల్లేస్తారు. అవును మరి, ట్రంప్‌ల నాలుక ఎప్పుడూ వంకరే!
గుర్తించండి బాస్!
ఇన్‌స్టంట్ కాఫీని ఒక్క నిమిషంలో కప్పులో పోసి అందిస్తున్నప్పుడు…మసాలా నూడుల్స్‌ను రెండు నిమిషాల్లో ప్లేటులో వడ్డిస్తున్నప్పుడు… బావర్చీ బిర్యానీ నుంచి బట్టర్ దోసె వరకూ ఏదైనా పది నిమిషాల్లోనే డెలివరీ చేస్తున్నప్పుడు… అవార్డులూ పురస్కారాల కోసం మాత్రం ఏళ్ల తరబడి ఎదురుచూడటం ఎందుకూ? మేం ఖండిస్తున్నాం. నిరసిస్తున్నాం. సూటిగా ప్రశ్నిస్తున్నాం… అంటూ తెగ ఆవేశపడతారు పబ్లిసిటీ ప్రియులు. ఇలాంటి వాళ్లు ఆలస్యాన్ని అస్సలు సహించలేరు. ఓ చెత్త పుస్తకం రాసిపడేసి, ‘జ్ఞానపీఠం’ ఎక్కేయాలనుకుంటారు. ఏ చౌరస్తా దగ్గరో అరడజను అరటిపండ్లు పంచేసి ‘సేవారత్న’కు అర్హత సాధించామని భ్రమపడిపోతారు. ఒకట్రెండు ఫ్లాపు సినిమాల్లో అతిథి పాత్రలు పోషించేసి, ‘స్వర్ణ నంది’ని అందుకోవాలని ఆరాటపడతారు. అవార్డులూ రివార్డులూ తమకు రావడం లేదనే ఏడుపు ఒకవైపూ, ఇంకెవరో తన్నుకుపోయారనే కడుపుమంట మరోవైపూ! ఆ ప్రచారప్రియుల జాబితాలో మన సహోద్యోగులూ, సహాధ్యాయులే కాదు… సాక్షాత్తు ట్రంప్ మహాశయుడూ ఉన్నాడు. రవీంద్రభారతి రాచమర్యాదలూ, గానసభ గజమాలలూ కాదు కానీ, కొడితే నోబెల్ పురస్కారమే కొట్టాలనే ఆలోచన ఎప్పుడొచ్చిందో, ఎందుకొచ్చిందో తెలియదు కానీ… మరుక్షణం నుంచీ అమెరికా అధ్యక్షుడు శాంతిదూత అవతారం ఎత్తేశాడు. నెల్సన్ మండేలాలా జీవితాంతం జైల్లోనే గడపక పోయినా, అంగ్‌సాన్ సూకీలా ప్రాణాలకు తెగించి ఆత్మాభిమాన పోరాటం చేయకపోయినా… ఆ అంతర్జాతీయ పురస్కారాన్ని అందుకునే చిట్కాలేమైనా ఉన్నాయేమో కనుక్కోమని సలహాదారులను పురమాయించాడు. మొత్తానికి ఓ ఐడియా పిచ్చిపిచ్చిగా నచ్చేసింది అతనికి.
ఆ ప్రకారంగానే, అంతర్యుద్ధాలతో సరిహద్దు తగాదాలతో ఉడికిపోతున్న దేశాలను ఎంచుకున్నాడు. నయానో భయానో అక్కడ ‘శాంతి’ని నెలకొల్పడానికి బయల్దేరాడు… తెల్లపావురాన్ని భుజాన వేసుకుని మరీ! ప్రస్తుతానికి, ఓ ఏడెనిమిది యుద్ధాల్ని ఆపే ప్రయత్నంలో ఉన్నానంటూ బల్లగుద్ది చెప్పినా, తన వల్లే ఇజ్రాయెల్-హమాస్ శాంతి ఒప్పందం కుదిరిందని అంతర్జాతీయ వేదికల మీద ఆర్భాటంగా ప్రకటించినా నోబెల్ న్యాయనిర్ణేతలు విననట్టే నటించారు. దీనికితోడు, ‘కండబలంతో సాధించే శాంతి… అణచివేతతో సమానం’ అంటూ మేధావి వర్గం పెదవి విరుపులు ఒకటి. చివరికి, శాంతి పురస్కారం ఎవరికో వెళ్లింది, ట్రంప్‌కు అశాంతే మిగిలింది!
ఓ సుప్రసిద్ధ రచయితను ‘మాస్టారూ! అందరికీ అవార్డులు వస్తున్నాయి. మీకెందుకు రాలేదూ?’ అని అడిగారు ఎవరో. ‘నాయనా! అవార్డులు మనల్ని వెతుక్కుంటూ రావు. మనమే వాటిని వెతుక్కుంటూ వెళ్లాలి’ అని జవాబిచ్చారు ఆ రచయిత. కొన్నిసార్లు అలా పురస్కారాల్ని ఫాలో అవుతూ వెళ్లినా తిరస్కారాలే మిగుల్తాయి. అలాంటప్పుడు ‘ఆ అవార్డులకు ఇంకా మన స్థాయి రాలేదు కాబోలు’ అని సర్దుకుపోవాల్సిందే. ఈ కఠోర సత్యాన్ని మన చుట్టుపక్కల ఉన్న కీర్తి కాంక్షాపరులకు మనమే చెప్పాలి. ట్రంప్‌కూ ఎవరో ఒకరు చెప్పే ఉంటారు. చెప్పకపోయినా ఈపాటికే అర్థమైపోయి ఉంటుంది. తనిప్పుడు, ‘నోబెల్-2026’ లక్ష్యంగా పని చేస్తున్నట్టు ప్రచారం. ట్రంప్ బ్యాచి కోసమే సృష్టించిన బైబిల్‌లో లేని సూక్తి…. ‘తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గించబడును!’
పక్కా బిజినెస్ మైండ్!
మీ ఇంటికొస్తే నాకేం ఇస్తావ్?
మా ఇంటికొస్తే నాకేం తెస్తావ్?
… అని అడిగేంత స్వార్థపరులు మన చుట్టుపక్కల బోలెడంత మంది. తొలి షేక్‌హ్యాండ్ సమయానికే ‘ఈ బకరాని ఎలా వాడుకోవాలి?’ అనే ఆలోచన మొదలైపోతుంది. డబ్బున్న ఆసాములనైతే, అప్పులకూ ష్యూరిటీలకూ ఉపయోగించుకుంటారు. పలుకుబడి కలిగిన పెద్దలనైతే, సెక్రటేరియట్ పనులకూ కలెక్టరేట్ వ్యవహారాలకూ వెంటేసుకుని వెళ్తారు. కొందరైతే, ఉరుములుల్లేని మెరుపులు. అప్పటివరకూ ఎక్కడుంటారో తెలియదు, ఏం చేస్తుంటారో తెలియదు. హఠాత్తుగా ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతారు. లేదంటే, ఏదో కొత్త నంబరు నుంచి కాల్ చేస్తారు. ‘కలుద్దాం సోదరా!’ అంటూ ఓ అడుగు ముందుకేస్తారు. మొహమాటానికి మనం ‘ఓకే’ అనడమే ఆలస్యం… ఇంటి ముందు దిగిపోతారు. ఆ కబుర్లూ
ఈ కబుర్లూ చెప్పేసి, ‘ఇంతకీ నీకు ఎన్ని పాలసీలున్నాయ్’ అంటూ అసలు విషయంలోకి వచ్చేస్తారు. కట్టేదాకా వదలరు. రియల్ ఎస్టేట్ వెంచర్లూ, గొలుసుకట్టు ఇన్వెస్ట్‌మెంట్లూ, టాక్స్ సేవింగ్ బాండ్లూ, ఎత్తేసే చిట్లూ… కమీషన్ కోసం ఎంతకైనా తెగిస్తారు, ఏదైనా అంటగట్టేస్తారు. స్నేహం ముసుగులో, ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడేవారూ ఉన్నారు. ట్రంప్ ధోరణీ ఇలాంటిదే. ‘నా శత్రువుల్ని నీ శత్రువుల్లా భావించాలి. నేను ఉసిగొల్పితే గొడవపడాలి. నేను కన్నుగీటితే తొడగొట్టాలి. అప్పుడే, నువ్వు నా బెస్ట్‌ఫ్రెండ్ అయినట్టు. ఎటూ మనం దోస్తులమే కాబట్టి, నీ సరుకుల్ని నేను వంకాయలూ బెండకాయలంత చౌకగా కొంటాను. సంతోషంగా అమ్మాల్సిందే.
నా సరుకుల్ని నీకు దడపుట్టించే ధరకు అమ్ముతాను. చచ్చినట్టు కొనాల్సిందే’ అంటూ ప్రపంచ దేశాలకు షరతులు విధిస్తాడా పెద్దమనిషి. ఆ ఫార్ములా ప్రకారమే…
రష్యా కావాలో, తాను కావాలో తేల్చుకోమంటూ మనకు వార్నింగ్ ఇచ్చాడు. ఎంతోకొంత కండబలం, గుండెబలం ఉన్న దేశాల్ని హెచ్చరించడానికి ఈమధ్య ‘అణు ప్రయోగం’ గురించి మాట్లాడుతున్నాడు. ఇకనుంచైనా కలిసుందామంటూ చైనాకూ కన్నుగీటాడు.
స్నేహాలకు ‘ఎక్స్‌పైరీ డేట్’ పెట్టుకునే మహానుభావులూ ఉంటారు. చేసుకోవాల్సిన పనులన్నీ చేసుకున్నాకా, పిండుకోవాల్సిన ప్రయోజనాలన్నీ పిండుకున్నాకా, అవతలి మనిషి ఒట్టిపోయాడనే గట్టి నిర్ణయానికొచ్చాకా … కాంటాక్ట్ లిస్ట్‌లోంచి ఆ పేరును శాశ్వతంగా డిలీట్ చేస్తారు. ఎలన్ మస్క్ సంగతే తీసుకోండి. ట్రంప్ ఆ కుబేరుణ్ని ‘వాడుకోవడం ఈ స్థాయిలో ఉంటుందా!’ అనిపించేంతగా వాడేసుకుని… రీసైకిల్ బిన్‌లోకి తోసేశాడు. ఆ దెబ్బకు మస్క్‌కు మసకమసకగా ‘అంతరిక్షం’ కనిపించి ఉంటుంది.
ట్రంప్ కళ్లకు దేశాలు దేశాల్లా కాకుండా, ముడిసరుకుల గోదాముల్లా దర్శనమిస్తాయి. అప్పుడప్పుడూ, పాకిస్థాన్‌కు ‘ఐ లవ్ యూ’ చెప్పడానికి కారణం కూడా… ప్రేమో దోమో కాదు… బలూచిస్థాన్‌లోని అపారమైన ఖనిజ నిల్వలే! ఇజ్రాయెల్- హమాస్ శాంతి ఒప్పందం వెనకా ట్రంప్ మార్కు వ్యాపార కోణం ఉందనే వాదనా వినిపిస్తోంది. ట్రంప్‌కు తెలిసినవి రెండే మార్గాలు.. డీల్, నో డీల్! ఒప్పందం కుదిరితే, సరుకుల్ని ఎంత చౌకగా కొనాలన్నది ఆలోచిస్తాడు. కుదరకపోతే, ఎంత బలంగా లాక్కోవాలన్నది ఆలోచిస్తాడు. ఎలాగైనా గెలవాలనుకోవడం ట్రంప్‌ల బలహీనతే కావచ్చు, కానీ, ఎప్పుడూ వాళ్ల చేతుల్లో ఓడిపోవడం మన బలహీనత కాకూడదు!
అంతా మన మంచికే!
ఆరునెలలకోసారి అద్దె పెంచే ఇంటి యజమానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. చిన్నదైనా సరే, ఓ సొంతిల్లు కొనుక్కోవాలనే ఆలోచన కలిగిస్తాడు. రాచి రంపాన పెట్టే బాసుకు రుణపడి ఉండాలి. అంతకంటే మంచి ఉద్యోగం సాధించాలనే పట్టుదలను పెంచుతాడు.
కఠినాత్ముడైన అప్పులవాడిని కలకాలం గుర్తుంచుకోవాలి. చచ్చినా, ఎవరి ముందూ చేయి చాచకూడదనే జ్ఞానోదయాన్ని కలిగిస్తాడు.
ఎవరో ఒకరు వెన్నుపోటు పొడిచాక కానీ, ఎవర్నీ అతిగా నమ్మకూడదనే సత్యం బోధపడదు. ఎవరో ఒకరు డబ్బు ఎగ్గొట్టాక కానీ, స్తోమతకు మించిన చేబదుళ్లు ఇవ్వకూడదనే వాస్తవం తెలిసిరాదు. ఆమాటకొస్తే, టారిఫ్‌ల బేరంలో ట్రంప్ తెంపరితనం నుంచి భారత్ కూడా చాలా పాఠాలే నేర్చుకోవాలి. నేర్చుకుంటోంది కూడా. అమెరికా పట్ల తన దీర్ఘకాలిక విధేయతను సమీక్షించుకుంటోంది. చైనాతో సంబంధాల విషయంలో తన దౌత్య విధానానికి మెరుగులు దిద్దుకుంటోంది. స్వావలంబనకు దీర్ఘకాలిక వ్యూహాలు రచించుకుంటోంది. భారతీయ ఉత్పత్తులకు కొత్త కస్టమర్లను వెతుక్కుంటోంది. ట్రంప్ అనే అగ్రదేశాధినేత ప్రపంచ పెద్దన్న తరహాలో కాకుండా, ఆరితేరిన వ్యాపారిలా వ్యవహరించకపోయి ఉంటే, మనకు మారాలన్న ఆలోచనే వచ్చేది కాదు. ఇంత ఖనిజ సంపద, ఇన్ని మానవ వనరులు, ఇంత పెద్ద మార్కెట్ ఉన్నప్పుడు…ఎవరి దయాదాక్షిణ్యాల మీదో ఆధారపడటం ఎందుకూ! కొన్ని పరిణామాలు అప్పటికప్పుడు… తీవ్ర సమస్యల్లా అనిపించినా, ఆశావాదంతో ఆలోచిస్తే అందులోనే ఓ పరిష్కారం దొరుకుతుంది. అంతిమంగా మంచే జరుగుతుంది. అందువల్ల… ట్రంప్‌లను తీవ్రంగా ద్వేషించకూడదు, అలా అని, గుడ్డిగా ప్రేమించనూ కూడదు. అలాంటివాళ్లు సమస్యల రూపంలోని సరికొత్త అవకాశాలని అర్థం చేసుకోవాలంతే. సినిమాలో విలన్ ఎంత శక్తిమంతుడైతే, హీరో అంతకు రెట్టింపు బలవంతుడు అవుతాడు… క్లైమాక్స్ సమయానికి. ట్రంప్‌లను నిలువరించాలంటే, మనం ‘ట్రంప్ ప్లస్’లు కావాల్సిందే!
* *
మన చుట్టూ ఉన్న ట్రంప్‌లు పక్కా లెక్కల మనుషులు. అదే వాళ్ల బలమూ, బలహీనతా. రూపాయి లాభం వస్తే వదులులేకోరు. రూపాయి నష్టం వస్తే తట్టుకోలేరు. అచ్చంగా ఆ వ్యాపార భాషలోనే మనం వాళ్లకు బదులివ్వాలి. మార్కెట్ ఎకానమీలో ఆర్థిక సంపత్తి, అణు సామర్థ్యం కంటే శక్తిమంతమైంది. బేరమాడే శక్తినిస్తుంది. ఎదిరించే తెగువనిస్తుంది. నలుగురినీ ప్రభావితం చేయగలిగిన పెద్దరికాన్ని ఆపాదిస్తుంది. డబ్బును చూసి కొండమీది కోతి దిగిరాకపోవచ్చు. కానీ, మనిషి దిగొస్తాడు. అతను అమెరికా అధ్యక్షుడైనా కావచ్చు!